పనస పొట్టు ఆవ పెట్టిన కూర ని నేను ప్రత్యేకం గా నా బ్లాగు లో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటె అది ఏమి నా ప్రయోగమూ కాదు, కొత్త వంట అంత కన్నా కాదు. ఇది చాలా పాత కాలపు వంట. గోదావరి జిల్లాల వారికి ఇది చాలా ప్రత్యేకం కూడా. ఈ పోస్టు వ్రాయటానికి కల ముఖ్య ఉద్దేశము....అమెరికా లో పనసపొట్టు ఎక్కడ, ఎలా దొరుకుతుందో.....దాన్ని ఎలా వండుకోవాలో తెలియ పరచటం ....
మేము చిన్నప్పుడు పాల్వొంచ లో వున్నప్పుడు, మా యింట్లో పనస చెట్టు వుండేది. ఆ చెట్టుకి కాయలు చాలా చిన్నవిగా కాసేవి. తొనలు కూడా పెద్ద తీపి ఉండేవి కావు. అప్పుడు ఎవరో చెప్పారు 'ఇది కూర పనస, పండు పనస వేరు కూర పనస వేరు' అని. మన పండు అరటి, కూర అరటి లాగా అనమాట. సరే అలాగే అనుకుందాము. ఇప్పుడు కూర చేయటం ఎలా మరి? దానికి సమాధానం మా పక్క యింట్లో ఉన్న మా ఇంగ్లీషు మేడంగారు. శేషగిరి ఆవిడ పేరు. ఆవిడ ఒకసారి ఒక కాయని అడగటం మేము యివ్వటం జరిగింది. ఆవిడ దానితో ఆవ పెట్టి కూర చేసి కారెజి బాక్సులో పెట్టి పంపారు. 'అబ్బ అసలు యింత బాగా ఉంటుందా కూర' అనిపించింది. అప్పటినుండి మొదలు మా అమ్మ దానిని వండటం మొదలు పెట్టింది. చిన్న కాయే అయినా,దానిని కూర చేస్తే ఒక పెద్ద బేసిను నిండెడు వస్తుంది. అందులోను పులిహోర పోపు ఆవ పెట్టి చేస్తాము కదా, మరునాటికి యింకా బాగా తయారు అవుతుంది. ఒక నాలుగు, అయిదు రోజులు ఫ్రిజ్జి లో పెట్టుకుని నేనే తినేదాన్ని. నాకు మహా ఇష్టమయిన కూర అది.
మేము పాల్వొంచ వదిలేదాక ఈ కూరకి కొదవలేదు. సీజను వస్తే చాలు ఆ కూర వండించుకుని తినేదాన్ని. పాల్వొంచ వదిలి హైదరాబాద్ వచ్చాక యిది దొరకటం కొంచం కష్టం అయిందనే చెప్పాలి. అక్కడక్కడ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది లెండి కాని నేను అమెరికా వచ్చాక అసలు దాని సంగతి పూర్తిగా మర్చి పోయాననేచేప్పాలి. ఈ నేపధ్యం లో
ఒకసారి మా చుట్టాల యింటికి సిన్సినాటి వెళ్ళటం జరిగింది.ఆవిడ చక్కటి విందు భోజనం లో భాగంగా పనసపొట్టు కూర, గోంగూర పులుసు, ముద్దపప్పు,మామిడికాయ పచ్చడి, పులిహోర ఇలా చాలా రకాలు చేసి పెట్టింది. అసలు ఆ రోజు భోజనం అమృతం అని చెప్పాలి. ముఖ్యం గా పనస పొట్టు కూర చూడగానే ప్రాణం లేచినట్లు అయింది నాకు. అప్పుడు ఆవిడ అసలు యిది ఎక్కడ దొరుకుతుందో, దానిని ఏమి అంటారో వివరాలు చెప్పగా విని నోటు చేసుకున్నాను. అదే మీతో పంచుదామని నా ప్రయత్నం.
ముఖ్యం ఈ పోస్టు అమెరికా లో ఉంటున్న మన వాళ్ళకోసం అందులో అమెరికా లో పనసపొట్టు కూరని మిస్ అవుతున్నవాళ్ళ కోసం రాస్తున్నది......
పైన చూపించిన ఈ ఫోటోను చూడండి. 'Chaoko Young Jack Fruit ' అని పచ్చి పనస ముక్కలు కాన్ లలో దొరుకుతాయి. మన ఇండియన్ గ్రోసరీలోను, కొరియన్ స్టోర్స్ లోను దొరుకుతుంది ఇది.(దాని మిద డేట్ అది చూసి తెచ్చుకోండి.)
నేను అయితే వండినప్పుడే రెండు కాన్ లకు తక్కువ వండను. కాన్ ఒపెనేర్ తో కాన్ ఓపెన్ చేస్తే ఈ కింద ఫోటో లో ఉన్న విధం గా మీకు ముక్కలు వుంటాయి.
వాటిని రెండు ముక్కలు చేసి మిక్సిలో రెండు తిప్పుళ్ళు తిప్పితే చాలు ఈ కింద ఫోటో లో చూపినట్లు మీకు పనస పొట్టు రెడీ అవుతుంది.
మాములుగా అయితే పనస పొట్టు కొట్టటం ఒక పెద్ద పని. ఇండియా లో అయితే ముందు చేతికి నూనె రాసుకుని, కాయని వలిచి కొట్టటం అంటే మాటలు కాదు. ఇక్కడ రెడీమేడ్ గా మీకు ముక్కలే దొరుకుతాయి. ఇంకాచెప్పాలి అంటే ఇండియా లో దాన్ని మీరు కుక్కర్
లో ఉడికించాలి పసుపు అది వేసి. ఇక్కడ అసలు విడిగా వుడికించే పనే లేదు. ముక్కే పట్టుకుంటే మెత్తగా వుంటుంది. ఇంక కూర వండటానికి కావలసిన పదార్దాల విషయానికి వస్తే...
కావాల్సిన పదార్ధాలు:
2 కాన్స్ యంగ్ జాక్ ఫ్రూట్, చింతపండు గుజ్జు ఒకటి లేదా రెండు స్పూన్స్, ఆవాలు 1 1 /2 స్పూను (ఆవ కోసం), ఉప్పు తగినంత, పచ్చి మెరపకాయలు ఆరు, ఎండు మిర్చి రెండు, పొట్టు మినపప్పు 1 టీస్పూను, సెనగపప్పు ఒక టీస్పూను, కరివేపాకు రెండు రెబ్బలు, ఆవాలు ఒక టీస్పూను, ఇంగువ చిటికెడు, పసుపు అర టీస్పూను, పల్లీలు గుప్పెడు, జీడి పప్పు గుప్పెడు, నూనె తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా కాన్ ఒపెనేర్ తో కాన్ ఓపెన్ చేసి పనస ముక్కలను ఒక గిన్నెలోకి వేసి బాగా కడగాలి. తరువాత ప్రతి ముక్కను రెండు లేదా మూడు ముక్కలు చేసి మిక్సిలో రెండు తిప్పుళ్ళు తిప్పాలి. యిప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి, మూడు స్పూనుల నూనె పోసి కాగాక పులిహోర పోపు వేయాలి అంటే మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ ,పసుపు అనమాట. తరువాత అందులోనే పల్లీలు, జీడి పప్పు కూడా వేసి పోపు వేగాక, అందులో పనసపొట్టు వేసి బాగా కలిపి , చింతపండు పులుసు, ఉప్పు వేసి కలిపి మీడియం లో పెట్టి మూత పెట్టి వదిలేయాలి. పులుపు ఎక్కువ,తక్కువ కాకుండా చూసుకోవాలి. ఒక పది నిమిషాలు అయిన తరువాత మూత తీసి చూస్తే తెలుస్తుంది ముక్క ఉడికింది లేనిది. ఇప్పుడు మూత తీసి కూర పొడి పొడి ఆడెంతవరకు మీడియం లోనే ఉంచాలి. కొద్దిగా నూనె కావాలి అంటే జోడించవచ్చు. చివరగా పొయ్యి కట్టేసిన తరువాత ఆవ కోసం తీసుకున్న ఆవాలను కాసిన్ని నీళ్ళతో బాగా నూరి కూరా చల్లారిన తరువాత అందులో వేయాలి. అంతే కూర తినటానికి తయారు. మామూలుగా అన్ని ఆవ పెట్టిన కూరలలాగా, పులిహోర లాగానే ఈ కూర మరునాటికి చాలా బాగుంటుంది ఆ రోజు కంటే కూడా.
యిక మిస్ కాకుండా వెంటనే ప్రయత్నించండి.
అద్భుతః!! :)
ReplyDeleteనిన్నే మన పటేల్ లో పనసకాయ దొరికింది. గింజ ముదిరింది కాని, కొంత పొట్టు ఐతే వచ్చింది. ఈ వీకెండ్ పనసపొట్టు ఆవ కూర అనుకుంట!!
kaya konnara? adi kastam kadandi kottatam. anyway mi expereience cheppandi kayatho yela kudirindo. can ayithe super easy :)
ReplyDeleteGood one. Will Try. Thank u!!! :)
ReplyDeleteSusmitha
Good one Vandana!
ReplyDeleteAnonymous people.... Thankyou very much
ReplyDelete