Tuesday, February 8, 2011

తెలుగు - ఇంగ్లీషు

నా యీ వ్యాసము చదవటం మొదలు పెట్టాక, అసలు యీమె ఏమి చెప్పబోతోంది? ఇంగ్లీషు అంటే యిష్టం అనా లేక తెలుగు అంటే యిష్టం అనా అని అనిపిస్తుంది. మొత్తం చదివితే తెలుస్తుంది నా బాధ ఏమిటో, నేనేమి చెప్పదలుచుకున్నానో...
నాకు తెలుగు భాష అంటే చాలా యిష్టము. నేను నా బ్లాగు నే తెలుగు లో క్రియేటు చేసుకుని, google transliteration ద్వారా ప్రతి ఒక్కటి టైపు చేసి రాయటము అది చూస్తేనే మీకు అర్దము అవుతుంది. మా పిల్లలు యిద్దరు అమెరికా లోనే పుట్టారు. (పిల్లవాడు చిన్నవాడు అనుకోండి), పాపకి యిప్పుడు అయిదుఏళ్ళు. తను తెలుగు మాట్లాడుతుంటే అసలు అది అమెరికా లో పుట్టింది అంటే ఎవ్వరు నమ్మరు. అంత స్పష్టము గా

మాట్లాడుతుంది. తను మూడో ఏడు నుండి డే కేర్ కి వెళ్తోంది. మొత్తం దాదాపు పది గంటలు అక్కడే వుండేది. యింక దాని క్లాసు లో ఎక్కువ శాతం అమెరికన్స్ ఏ వున్నారు. అలాగ అని ఇంగ్లీషు రాదా అంటే అదీ కాదు. మొత్తం ఇంగ్లీషు accent లోనే మాట్లాడుతుంది. నాకు అయితే అది ఇంగ్లీషు మాట్లాడుతుందా అని డవుటు వచ్చేది. వాళ్ళ టీచరు ను అదే అడిగాను " మా పాప మిగతా పిల్లలతో ఎలా వుంటుంది ఎలా కమ్యునికేటు చేస్తుంది" అని అడిగా. ఆవిడ నా వంక వింతగా చూసింది “మీ పాప చాలా బాగా మాట్లాడుతుంది ఇంగ్లీషు” అని చెప్పగానే నాకు పెద్దగా నమ్మకము కలగక పోయినా, తరువాత అది దాని యీడు పిల్లలతో (ఇంగ్లీషు పిల్లలు) ఆడుకునేటప్పుడు తెలిసింది అబ్బో దీనికి బాగానే వచ్చు! అని. యింట్లో మాత్రము ఒక్క ముక్క కూడా ఇంగ్లీషు మట్లాడదు. యీ విషయములో మాత్రమూ నేను చాలా గర్వ పడతాను. నిజానికి మా యింట్లో అసలు ఇంగ్లీషు ఛానళ్ళు నడవవు. పొరపాటున కూడా ఇంగ్లీషు మాట్లాడము. ఎప్పుడయినా కాస్త ఇంగ్లీషు మాట్లాడవే అంటే ‘నీకు వచ్చా’ అన్నట్లు చూస్తుంది నా మొహనికేసి. ఏది అయినా మనము పిల్లలకి చెప్పే దాన్ని బట్టి వస్తుంది.

యిప్పుడు ఇంగ్లీషు విషయానికి వస్తే, నాది మొదటి నుండి ఇంగ్లీషు మిడియము. మొత్తము రాయటం, చదవటం అన్నీఇంగ్లీషు లోనే, ఒక్క మాట్లాడటం తప్ప. అదేంటో ఎవ్వరము కూడా ఇంగ్లీషు లో మాట్లాడేవాళ్ళం కాదు. ఎప్పుడో ఓసారి బుద్ధి పుట్టేది, ఏదో మొదలు పెట్టె వాళ్ళం, అంతే అయిపోయేది. కాని ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళను చూస్తే బాధగా అనిపించేది. ఒకసారి మా స్నేహితురాలు ఒక ఆమె మొదటినుండి మా దగ్గరే చదివి, కాలేజి మాత్రం వేరే రాష్ట్రము లో చదవటము మూలాన ఇంగ్లీషు భాష బాగా ఇంప్రూవ్ చేసింది. సింపులు పదాలతో బ్రేకులు లేకుండా, పదాలు వెతుక్కోకుండా, తడపడకుండా continous గా మాట్లాడటము అనమాట. తరువాత మేము హైదరాబాదు వచ్చిన తరువాత BPO వాళ్ళు ఒక ట్రైనింగ్ కోర్సు లాంటిది ప్రారంబించారు. ఆ కంపెనిలలో చేరే ఉద్దేశము అస్సలు లేదు కాని, ఆ రూపేణ ఇంగ్లీషు మాట్లాడటము నేర్చుకోవచ్చు అని ఆ పరీక్ష రాసా, సెలెక్టు అయ్యా. ఆ ట్రైనింగ్ నాకు బాగా నచ్చింది. సరే అది ఒక వారం రోజులు చేసాను, నాకు వేరే ఉద్యోగము రావటం, యిది మాని వేసి అటు వెళ్ళటము అయిపోయాయి. నాకు అయితే ఉద్యోగము మీద కన్నా దీని మీదనే వుండేది. కాని మా అమ్మ, యింకా కొంతమంది పెద్దవాళ్ళు, “ఇంగ్లీషు మాట్లాడటము అనేది మాట్లాడుతూ వుంటే వస్తుంది కాని ఏదో కోర్సులు చేస్తే రాదు, దానిలో గ్రామరు అది నేర్పుతారు అది నువ్వు చిన్నప్పటి నుండి నేర్చుకునేదే, ప్రత్యేకించి యిప్పుడు నువ్వు నేర్చుకుండేది ఏమి వుండదు” అని చెప్పారు. అది నిజమే అనిపించింది. ఉద్యోగము లో చేరిపోయా.
పెళ్లి అయ్యి అమెరికా వచ్చా. అప్పుడు చూడాలి, మాట్లాడటం మాట దేవుడు ఎరుగు, అసలు యీ తెల్ల వాళ్ళ భాష అర్దము అయ్యేది కాదు. మా వారు తెలుగు మిడియము అయినా చాలా చక్కగా మాట్లాడటము చూసి నాకు సిగ్గుగా అనిపించేది. ఇంగ్లీషు సినిమాలు చూస్తే కాస్త వాళ్ళ accent అది అర్దము అవుతుంది అని మొదట్లో అవి తెచ్చుకునేవాళ్ళం. పర్వాలేదు అర్దము అయ్యేది (subtitles పెట్టుకునేవాళ్ళం అనుకోండి). యింకా మా యింటి దగ్గర ఒక తెల్ల ఆవిడ వుండేది. నేను కడుపుతో వున్నప్పుడు, స్విమ్మింగు పూలు దగ్గర పరిచయము అయ్యింది ఆవిడ. ఆవిడ నన్ను తెగ పలకరించేది. ఆవిడే నా మొదటి తెల్ల ఫ్రెండు అని చెప్పచ్చు. ఆవిడ తో కాస్త వచ్చి, రానీ భాష మాట్లాడేదాన్ని. ఎవరు మనతో అంత సేపు సమయము కేటాయిస్తారు చెప్పండి, వూరికే హాయ్, హేల్లోలు తప్ప. ఏదో అలా నడిచేది. ఒక రెండు ఏళ్ళు పోయాక ఉద్యోగము లో చేరా. మా ఆఫీసు లో తెలుగు వాళ్ళు వున్నారు, కాని మా టీము లో తెల్ల వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలా మొదలు అయింది నేను మాట్లాడటం. యిప్పటికి నాలుగో ఏడాది నేను ఉద్యోగము లో చేరి. మా టీము లో వాళ్ళతో మాట్లాడటము వలన ఆ జంకు పోయింది ముందు. ముందు అయితే అసలు మాట్లాడాలి అంటేనే భయము. ఎవరు ఏమి అనుకుంటారో, నవ్వుకుంటారో ఏమో అని అసలు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, అందరు మాట్లాడేవారు కాని నేను మాత్రం చాలా పొదుపు గా తక్కువ మాట్లాడేదాన్ని. యిప్పుడు యిక్కడ ఇంగ్లీషు మాట్లాడక పోతే అసలు నడవదు. అలానే స్టార్ట్ అయింది. మొదట్లో నాకు కాస్త యిబ్బంది అనిపించినా, క్రమం గా అది తగ్గింది. వాళ్ళు వాడే స్లాంగులు అవి బాగా తెలిసినాయి. ఒక్కో సారి యిప్పటికి, కాస్త అప్పుడప్పుడు మాటలు తడపడతాయి కాని, మొత్తానికి మెల్లగా, సులువు అయిన పదాలతో సింపులు ఇంగ్లీష్ మెల్లగా మాట్లాడటం వచ్చింది. ముందు ఆ బెరుకు పోయింది. పెద్ద పెద్ద complicated పదాలు నేను వాడను. అలా అని వాటికి వ్యతిరేకిని కాదు. సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తా. మొత్తానికి యిప్పుడు నేనంతటి నేను అందరిని పలకరించటం చేస్తున్నా. యిది వరకు ఎవరు పలకరించినా 'అబ్బ ఏమిటి యీ గోల అనుకునేదాన్ని".
మొత్తానికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మన భాష ను మనము ఎప్పుడు మరచి పోకూడదు. పిల్లలతో తప్పకుండ మన మాతృ భాష లోనే మాట్లాడటం చేస్తూ వుంటే వాళ్ళు తప్పకుండ అదే మాట్లాడతారు. అమెరికా లో పెరుగుతున్న పిల్లలకు ఇంగ్లీషు రాకపోవటం అంటూ వుండదు. వాళ్ళు స్కూలు కు వెళ్తే తప్పకుండ మన కన్నా బాగా accent తో మాట్లాడతారు. వాళ్ళకి మన భాష దూరం కాకుండా చూసే బాధ్యత మనదే. అలాగే మనము మన భాషను వదిలిపెట్టకుండా, సందర్భానుసారం బయటకు వెళ్ళినప్పుడు, ఆఫీసులోను, పర భాష మాట్లాడేవారి తో ఎవరి తో అయిన ఇంగ్లీషు తప్పని సరి కాబట్టి, దాన్ని మాట్లాడుతూ అభివ్రుద్ధ్హి చేసుకోండి అని చెప్తున్నాను.

4 comments:

  1. చాలా నిజం. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మనకి వద్దన్నా సమాజం నేర్పించేస్తుంది. తెలుగుని మరిపించేయ్యడానికి శతధా ప్రయత్నిస్తుంది. పిల్లలకి తెలుగు నేర్పించకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన తరవాత బాధ పడాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు నేర్చుకోమన్నా వినే పరిస్థితి ఉంటుంది అని నేను అనుకోను. మన భాష ని మనమే తక్కువ చేసుకొని వాళ్ళతో ఇంగ్లీష్ లో నే మాట్లాడుతూ ఉంటె తరవాత బాధ పడాల్సినది మనమే. (తెలుగు లో మాట్లాడినా కూడా చాల మంది వీలైనంత ఇంగ్లీష్ ని అందులోకి జోప్పించేస్తూ ఉంటారు "ఆ బుక్ ఇక్కడకి బ్రింగ్ చెయ్యి నాన్నా" అనుకుంటూ.. అలా మాట్లాడినా, ఇంగ్లీష్ లో మాట్లాడినా ఒకటే).

    ReplyDelete
  2. పిల్లలకి తెలుగు నేర్పించడం అనేది తల్లితండ్రులు ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన సమయం వచ్చింది. దీనికి ఉదాహరణ కోసం అమెరికా (లేదా ఏ భారతేతర దేశాల) దాకా వెళ్ళక్కర్లేదు. మనదేశం లోనే లెక్కకు మించిన ఉదాహరణలు ఉన్నాయి.

    కించపరచడానికి అని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా.. నేను ఇండియా లో ఉన్నప్పుడు ఒక పనమ్మాయి, వాళ్ళ పాప అల్లరి చేస్తుంటే మందలిస్తోంది.. "ఏటీ అల్లరి సేసేత్తన్నావు? డాడీ కి సెప్తానుండు.." అని. పనివాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అనీ కాదు, డాడీ అంటే తప్పుడు మాట అని కూడా కాదు. కానీ.. ఈతరం మనిషి కాకపోయినా ఆ తల్లి 'నాన్న' అనే పదం వాడడానికి సంకోచిస్తోంది అంటే.. ఈ ఇంగ్లీష్ పిచ్చి ఎక్కడిదాకా వెళ్లిపోయిందా అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. ఇంగ్లీష్ అనేది 'గొప్ప' కి చిహ్నంలా మారిపోతోంది. అసలు నిజం.. ఇంగ్లీష్ కూడా తెలుగులాగ కేవలం ఒక భాష అని జనాలు తెలుసుకుంటే ఈ మమ్మీ లు, డాడీ ల బదులు అమ్మ, నాన్న అనే అమృతతుల్య పదాలు వినిపిస్తాయి.

    మీరు చెప్పినట్టు.. అన్నిభాషల మీద గౌరవం ఉండాలి (అంటే.. తెలుగు తక్కువ అని భావించకూడదు). ఎప్పుడు ఏది సందర్భోచితమో అది వాడితే అందంగా ఉంటుంది.

    ఇది ఇలా ఉంచితే, నేను చాలా చోట్ల విన్నాను. అమెరికా లాంటి దేశాల్లో పుట్టిన మనవాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడినా teenage (కొండొకచో, ఇంకొంచెం ముందే) కి వచ్చేసరికి అది ఒక అవమానంలాగా భావించి తల్లితండ్రులతో నిక్కచ్చిగా 'మేము తెలుగు మాట్లాడము' అని చెప్పేస్తూ ఉంటారు అని. ఇది కొంచెం తలనెప్పి సమస్యే. దానికోసం చిన్నప్పటి నించీ వాళ్ళకి తెలుగు అంటే గౌరవం పెంచి, ఈ భాషకి కూడా వాళ్ళు ఉన్నత స్థానం ఇచ్చేలా చూసుకోగలిగితే మనభాష పదికాలాలపాటు మనగలుగుతుంది.

    ReplyDelete
  3. నమస్తే సోదరి వందనగారు
    నేను ఇక్కడ (AP..India) తెలుగు ఇష్టపడే ఇంగ్లిష్ టీచర్ ని. మీ ఆర్టికల్ లోని ప్రతి అక్షరం లో నా అంతరంగమే కనిపించింది.ఏమిటి చేయడం? అవసరం ఇంగ్లిష్ మాట్లాడమంటుంది..హృదయం తెలుగులో ఘోషిస్తుంది.మనకు అమ్మ తెలుగు ఐతే ...నేస్తం ఇంగ్లిష్...అవునుకదా.. By the way మీ పాపను ఈ విషయంలో అభినందించాలి... ప్రతాప్

    ReplyDelete
  4. అవునండి ప్రతాప్ గారు, ప్రస్తుత కాలం లో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే అసలు మనం అన్నిటిలోనూ వెనకపడినట్లే. తప్పకుండ నేరుచుకోవాలి, మాట్లాడాలి. అలా అని మన భాషను మరచిపోనక్కరలేదు, చీప్గాను చూడక్కరలేదు. సందర్బానుసారం మాట్లాడాలి. అవసరార్దం మాట్లాడాలి. పిల్లలకు అదే చెప్పాలి. నేను యింత కస్టపడి ఆ వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, మాకు తెలిసిన వాళ్లలోనే
    చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడితేనే వేల్యూ వుంటుంది అనుకుంటారు. కామెంట్ చేయటం కాదు కానీ మాకు తెలిసిన వాళ్లలోనే ముఖ్యం గా house wives 'ye come on ', ' గో అండ్ హావు దత్' అంటూ వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడతారు. అలా మాట్లాడితే అయిన వాళ్లకి వేల్యూ వుంటుంది అనుకుంటారో ఏంటో. నాకు BP పెరిగిపోతు వుంటుంది అలా చేసే వాళ్ళని చూస్తే. ఏమి చక్కగా మన భాషలో చెప్పవచ్చు కదా.

    ReplyDelete