ఏ రోటి పచ్చడి గురించి గూగుల్ లో వెతికినా అన్నిటికి దాదాపు రెండే పద్దతులు కొద్దిగా అటు యిటు తేడా తో. ఒకటి....ఏ కూరగాయ అయితే చేద్దాము అనుకుంటున్నామో దాన్ని పచ్చిమిర్చి తో మగ్గపెట్టి, కాస్త చింతపండు, జీలకర్ర, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సి కొట్టి పోపు పెట్టటం. రెండు.... పోపుసామానులు సెనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు ఎండుమిర్చి వేయించి, మగ్గినముక్కలతో మిక్సి కొట్టి కొత్తిమీర వెయ్యటం. ఈ రెండు రకాలు అన్ని కూరలతో చేయటం మాములుగా అందరు చేస్తూనే వుంటారు.
కాని కింద నేను చెప్పే పద్ధతి వీటికి కొంచం విరుద్దం. ప్రయత్నించి చూడండి.
మామూలుగా క్యాబేజీ కూర వండినప్పుడు ఆ పూటకి తిని మరుసటి పూటకి అంటే ఎవ్వరు ముట్టుకోరు. పిల్లలయితే అసలు చెప్పనే అక్కరలేదు. అది అలా ఫ్రిజ్జి లో ఒక రెండు, మూడు రోజులు మూలిగి వెనక్కి వెళుతుంది. అలా అని ఒక చిన్న క్యాబేజీ తీసుకుని తరిగినా, తరుగు బాగానే వస్తుంది. అప్పుడు కూర తో పాటు కాస్త తరుగుని పచ్చడికి ఉపయోగించి చూడండి. వెరైటీ గాను వుంటుంది, రుచి గాను వుంటుంది.
కావాల్సిన పదార్దాలు:
రెండు గుప్పెళ్ళు క్యాబేజీ తరుగు, మంచి నాటు టొమాటో ఒకటి, పచ్చి మిర్చి రెండు లేక మూడు, చింతపండు కొంచం, ఉప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, పొట్టు మినపప్పు, ఆవాలు, కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు (optional ) , నూనె, పసుపు.
తయారు చేసే విధానం:
ముందుగా క్యాబేజీ తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని దానికి కాస్త పసుపు, ఉప్పు చేర్చి, కాసిన్ని నీళ్ళు వూరికే అలా చిలకరించి బాగా పిసికి పక్కన ఒక పదిహేను, యిరవయి నిమిషాలు పెట్టండి.
యిప్పుడు ఒక బాణలిలో ఒక రెండు మూడు చెంచాల నూనె వేసి, కాగాక టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గించండి. తరువాత మిక్సి లో ఈ టొమాటో మిశ్రమం, అర చెంచ జీలకర్ర, కాస్త చింతపండు, తగినంత ఉప్పు వేసి మిక్సి పట్టండి. (ఉప్పు చూసుకుని వెయ్యండి. క్యాబేజీ లో ఉప్పు ఆల్రెడీ వేశాము) (టొమాటో పచ్చడి బాగా పలుచగా ఉండేటట్లు కాకుండా కొంచం చిక్కగా ఉండేటట్లు చూడండి). యిప్పుడు క్యాబేజీ ముక్కలు ఉన్నబౌల్ తీసుకుని యి టొమాటో పచ్చడి దాంట్లో ఒక స్పూను వెయ్యండి. యిక్కడ గుర్తు పెట్టుకోవాలసినది ఏమిటి అంటే టొమాటో పచ్చడి లో క్యాబేజీ ముక్కలు తగులుతూ వుండకూడదు. క్యాబేజీ ముక్కలకి టొమాటోపచ్చడి అంటుకుని వుండాలి. అంటే పచ్చడి ఎక్కువ వుండకూడదు. అందుకే ముందు ముక్కలలో ఒక చెంచా పచ్చడి వేసి బాగా కలిపి కావలసి వస్తే యింకాస్త వేయాలి.
యిప్పుడు యిక పోపు కోసం బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, పొట్టుమినపప్పు, యింగువ, కరివేపాకు వేసి పచ్చడి లో వేయటమే. చివరగా కొత్తిమీర చల్లితే క్యాబేజీ పచ్చడి is ready to taste. యింగువ, వెల్లుల్లి ఈ రెండిటిలో ఏది కావాలి అంటే అది వేసుకోవచ్చు పోపులో.
యిది దాదాపు మనకు సలాడ్ లాంటిదే. నూనె తక్కువ వేసి టొమాటో పచ్చడి చేస్తే చక్కటి ఆరోగ్యవంతమయిన డైట్ చపాతిలోకి, అన్నంలోకి తినటానికి తయార్.
అచ్చం గా యిదే పద్దతిలో దొండకాయ కూడా వేసి చెయ్యవచ్చు. కాని దానికి, ముందు ఉప్పు వేసి వూరబెట్టాలసిన అవసరం లేదు. అచ్చం గా ముక్కలు వేసేసుకోవచ్చు. ముక్కలు మాత్రం చాలా చిన్నవిగా తరగాలి. క్యాబేజీ పచ్చడి కి అయితే టొమాటో పచ్చడి కొంచం తక్కువే పడుతుంది. దొండకాయకి మాత్రం కాస్త పచ్చడి ఎక్కువగా ఉంటేనే రుచి. క్యాబేజీ తరిగినప్పుడే కాసిన్ని దొండకాయలు తరిగి పెట్టుకుంటే రెండు పచ్చళ్ళు ఒకేసారి చేసుకోవచ్చు. యింట్లో ఒకటి రెండు టొమాటోలు, కాసిన్ని పచ్చిమిర్చి వుంటే చాలు. పచ్చి కూరలు వంటికి మంచివి అంటున్నారు కదండి, అలా అని అవి కొరుక్కు తినెయ్యలేము కదా, ఏదో నోటికి నచ్చేలా, చపాతి, అన్నం లో కూడా కలుపుకుని తినేలా ఈ రెండు ప్రయత్నించి చూడండి.
Vandana, nuvvu Detroit vacchinappudu chesina Mango pacchadi recipe kuuda post cheyyava.
ReplyDeleteoh ya. kani adi variety pachadi kade :) anyway aa recipe niku mail chesthanu personal ga
ReplyDelete